కార్తీకమాసంలో “పురాణ శ్రవణం” చేయడం ఎంతో పుణ్య విశేషం. అందువలన తప్పకుండా పురాణ శ్రవణం చేయాలి. ఆ విధంగా చేయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుడు, అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు. కళింగ దేశంలో “మంధరుడు” అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు .. మొదటి నుంచి కూడా ఆయన ఆచారవ్యవహారాలు పెద్దగా పట్టించుకోకుండా, తనకి తోచినట్టుగా జీవిస్తూ ఉంటాడు. కుటుంబం గడవడం కోసం కూలి పనులు చేస్తూ ఉంటాడు.

మంధరుడు ఎంతటి దుర్మార్గుడో .. ఆయన భార్య అంతటి ఉత్తమురాలు. తన భర్త సంపాదనను బట్టి ఆయన సమర్థతను అంచనా వేయకుండా, ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేది. ఆయన ఏది తెచ్చినా .. ఆ భగవంతుడు ఇచ్చింది అదేనని అనుకుంటూ ఆ పూట గడిచినందుకు సంతృప్తిని పొందుతూ ఉండేది. అంతేగాని ఇరుగు పొరుగువారితో పోల్చుతూ, తన భర్తను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు. ఇతరుల ముందు ఆయనను చులకన చేసేది కాదు. అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగుతూ ఉండేది.

అలా కొంతకాలం గడిచిన తరువాత, కూలి డబ్బులు తమ అవసరాలకి సరిపోవడం లేదని భావించిన మంధరుడు, ఇక తాను ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటే, దారిదోపిడీలు చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు నుంచి కూలి పనులు మానేసి, ఒక కత్తి పట్టుకుని అడవి మార్గంలో కాపు కాయడం మొదలు పెడతాడు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లే బాటసారులను బెదిరిస్తూ, వాళ్ల దగ్గరున్న సొమ్మును బలవంతంగా దోచుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు.

ఒక రోజున దట్టమైన ఆ అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్ముతో హడావిడిగా వెళుతూ ఉంటాడు. ఆయన కళ్లలోని భయాన్ని బట్టి, ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయాన్ని మంధరుడు గ్రహిస్తాడు. వెంటనే కత్తి చేతబట్టి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అలా ఆయనను చూడగానే ఆ బ్రాహ్మణుడు బెదిరిపోతాడు. తనని ఏమీ చేయవద్దని కోరుతూ తన దగ్గరున్న సొమ్మంతా ఇచ్చేస్తాడు. చాలా రోజుల తరువాత అంత మొత్తం కళ్లజూసినందుకు మంధరుడు ఆనందంతో పొంగిపోతుంటాడు.

అనునిత్యం అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తూ ఉండే ఒక కిరాతకుడు, అదే సమయంలో అటుగా వస్తాడు. మంధరుడి దగ్గర ఉన్న సొమ్మును చూసి, బలవంతంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ కిరాతకుడు ఇద్దరి బ్రాహ్మణులను చంపేస్తాడు. అక్కడి నుంచి ఆయన వెనుదిరాగాలని అనుకుంటూ ఉండగా, నరవాసనను పసిగట్టిన ఒక పులి అక్కడికి వస్తుంది. కిరాతకుడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ పోరాటంలో పులి వలన గాయపడి కిరాతకుడు మరణిస్తాడు. ఆయన వలన గాయపడిన పులి కూడా చనిపోతుంది.

అలా మంధరుడు .. బ్రాహ్మణుడు .. కిరాతకుడు .. పులి నరకలోకానికి చేరుకుంటారు. అయితే తన భర్త దారిదోపిడీలు చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల, ఉన్నదాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. అడవిలో జరిగిన సంఘటన ఆమెకి తెలిసే అవకాశం లేకుండా పోతుంది. కానీ జీవనోపాధి కోసం బయటికి వెళ్లిన భర్త, రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆమె మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు. ఆయన దర్శనం చేసుకున్న ఆమె, తన భర్త కనిపించకుండా పోవడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది.

ఆ సాధువు ఆమెకి ధైర్యం చెబుతాడు. కార్తీకమాసంలో “పురాణ శ్రవణం” చేయడం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుందనీ, పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలలో స్థానం లభిస్తుందని చెబుతాడు. ఆ రోజున “కార్తీక పౌర్ణమి” అనే విషయాన్ని గుర్తుచేస్తాడు. తాను పురాణ పఠనం చేస్తాననీ, అందుకు ఏర్పాట్లు చేయమని అంటాడు. దాంతో ఆమె తన ఇంట్లో అలికి ముగ్గులు పెడుతుంది. ఒత్తులు చేసి కార్తీక దీపం వెలిగిస్తుంది. తన ఇంట్లో పురాణ పఠనం జరుగుతుందని చెప్పి, చుట్టుపక్కలవారిని పిలుచుకు వస్తుంది. అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది.

పురాణ శ్రవణం గొప్పతనం వలన, ఆమెలో భక్తి పెరుగుతూ వెళుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ, అనుక్షణం విష్ణునామ స్మరణ చేస్తూ ఉంటుంది. ఒక వైపున భర్త కోసం ఎదురుచూస్తూ, మరో వైపున దైవారాధన చేస్తూ కాలం గడుపుతుంది. కొంతకాలానికి వయసు పైబడటం వలన ఆమె చనిపోతుంది. ఆమె కోసం దివ్య విమానంలో విష్ణుదూతలు వస్తారు. ఆమెను తీసుకుని విష్ణులోకానికి బయల్దేరతారు. అలా విష్ణులోకానికి వెళుతున్న ఆమె, నరకంలో “కాలసూత్రం”లో తన భర్త శిక్షించబడుతుండటం చూస్తుంది.

నరకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది. తన భర్త ఎప్పుడు .. ఎక్కడ .. ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి లోనవుతుంది. దివ్యవిమానమును ఆపమని విష్ణుదూతలను కోరుతుంది. దివ్య విమానం ఆపిన విష్ణుభటులు .. విషయమేమిటని అడుగుతారు. నరకంలో శిక్షను అనుభవిస్తున్న మంధరుడిని ఆమె చూపుతుంది. ఆయన తన భర్త అని వారితో చెబుతుంది. ఆయన ఏం చేశాడో .. ఎందుకు అలా శిక్షిస్తున్నారో అర్థంకావడం లేదంటూ ఆవేదన చెందుతుంది. ఆయనతో పాటు ఉన్నవారెవరో తెలియడం లేదంటూ అయోమయాన్ని వ్యక్తం చేస్తుంది.

మంధరుడు ఆమె అనుకున్నంత మంచివాడుకాదనీ, దోపిడీలు చేస్తూ ఎంతోమంది అమాయకులను బాధించాడని విష్ణు దూతలు చెబుతారు. బ్రాహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించాడని అంటారు. ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకుని, అదే డబ్బు కోసం వేరొక కిరాతకుడి చేతిలో మరణించాడని చెబుతారు. ఆయన చేసిన పాపాలే ఆయనను నరకానికి తీసుకుని వచ్చాయని అంటారు. ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతుంది.

మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న వారెవరు? అని సుశీల అడుగుతుంది. మంధరుడి చేతికి చిక్కిన బ్రాహ్మణుడు ఒక వంచకుడు. తన స్నేహితుడిని మోసం చేసి ఆ డబ్బుతో పారిపోతూ మంధరుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపిన పాపాలను మూటగట్టుకున్నాడు. అంతేకాదు బ్రాహ్మణులను చంపిన పాపం కూడా ఆయనకి చుట్టుకుంది. ఇక ఆ పులి అంతకుముందు జన్మలో ఆచార్య వ్యవహారాలను పాటించని ఒక బ్రాహ్మణుడు. అందువల్లనే వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు చెబుతారు.

తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు నరకలోకం నుంచి విముక్తిని పొందాలంటే ఏం చేయాలని విష్ణు దూతలను సుశీల అడుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు “పురాణ శ్రవణం” గురించి ప్రస్తావిస్తారు. ఆమె చేసిన పురాణ శ్రవణం పుణ్యం నుంచి నలుగురికి నాలుగు భాగాలుగా ధారపోస్తే, వాళ్లకు నరకం నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. దాంతో కార్తీక పౌర్ణమి రోజున తాను కార్తీక దీపం కోసం ఒత్తులు తీసుకురావడం .. వత్తులు చేయడం .. దీపం వెలిగించడం .. పురాణ శ్రవణం చేయడం అనే నాలుగు భాగాల్లో నుంచి ఒక్కొక్కరికీ ఒక్కో పుణ్యాన్ని ధారపోస్తుంది. దాంతో వాళ్లందరికీ ముక్తి లభిస్తుంది. వాళ్లంతా కృతజ్ఞతలు తెలియజేయడంతో, సుశీల విమానం విష్ణులోకం దిశగా సాగుతుంది. కార్తీకంలో పురాణ శ్రవణ విశేషాన్ని తెలుసుకున్న జనకుడు, వశిష్ఠ మహర్షికి సభక్తికంగా నమస్కరిస్తాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.