కార్తీకంలో ఒక రోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది .. కార్తీక శని త్రయోదశి వందరెట్లు … కార్తీక పౌర్ణమి వేయిరెట్లు .. శుక్ల పాడ్యమి లక్ష రెట్లు .. ఏకాదశి కోటి రెట్లు … ద్వాదశి అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము. ఆ రోజున ఆవుదూడలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన, ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో .. అన్నివేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటాడు.

కార్తీక ద్వాదశి రోజున “సాలగ్రామ దానం” చేయాలి. ఆ విధంగా చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలుపెడతాడు. పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు .. ఆయన చాలా పిసినారి. ఊళ్లోవాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు. ఎంతటి సిరిసంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికీ ఎలాంటి సాయం చేయడు. దైవకార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు.

ఊళ్లో వాళ్లలో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్నవారే గనుక, ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు. దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళతాడు. ఉన్నపళంగా తన డబ్బు చెలించమనీ .. లేదంటే ఊర్కునేదిలేదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బులేదనీ .. అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకి లేదని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. కొంత గడువు ఇవ్వమని కోరతాడు.

ఇంతకాలం ఆగడమే ఎక్కువనీ .. ఇంకా నిరీక్షించడం తన వలన కాదనీ .. మర్యదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుపడతాడు. ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది? .. ఎవరు ఇస్తారు? అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు. కొంత సమయం ఇస్తే అణాపైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు. ఆయినా వైశ్యుడు వినిపించుకోకుండా, ఆ బ్రాహ్మణుడి ఇంటిముందు చిందులు తొక్కుతూ .. అనేక రకాలుగా తిడుతూ .. చివరికి ఆవేశాన్ని అణచుకోలేక కొడతాడు. ఊహించని ఆ దెబ్బకి ఆ బ్రహ్మాణుడు అక్కడికక్కడే చనిపోతాడు.

బ్రాహ్మణుడు తన దెబ్బలకి చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు. ఆ సంఘటనను ఎవరైనా చూశారేమోనని అటూ ఇటూ చూస్తాడు. ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారుపడుతూనే చాలా కాలం గడుపుతాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ వైశ్యుడు చనిపోతాడు.

వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమలోకానికి తీసుకువెళతారు. యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలా చేయమని ఆదేశిస్తాడు. దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన .. బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదుగదా అని విచారిస్తూనే, ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు.

ఆ వైశ్యుడికి “ధర్మవీరుడు” అనే ఒక కొడుకు ఉంటాడు. ఆ యువకుడు తండ్రివలె కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు. దైవకార్యాలు నిర్వహించడమే కాకుండా, ప్రజలకు ఉపయోగపడే బావులు .. చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడచుకుంటూ ఉంటాడు. ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా .. ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి ధర్మవీరుడి ఇంటికి ఒక రోజున నారద మహర్షి వస్తాడు. సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావడం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి .. తన ఇల్లు పావనమైందనీ .. తన జన్మ ధన్యమైందని అంటాడు. నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెబుతాడు. కార్తీకమాసంలో స్నాన .. దాన .. జప .. దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాలను గురించి వివరిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున “సాలగ్రామ దానం” చేయమనీ, ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు.

కార్తీకమాసంలో సాలగ్రామదానం చేస్తే ఎంతో మంచిదనీ, నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు. తాను ఎన్నో దానాలు .. ధర్మాలు చేశాననీ, అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేక పోయినప్పుడు, కేవలం ఒక “రాయి”ని దానం ఇవ్వడం వలన ఆ పని జరుగుతుందా? అని అడుగుతాడు. ఒక రాయిని దానం చేయడం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవడం లేదని అంటాడు.

ఏది దానం చేసినా అది తీసుకున్నవారికి ఉపయోగపడాలనీ, ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు. అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెబుతాడు. సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడటం .. తాను చెబుతున్నా వినిపించుకొకపోవడంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే నారదమహర్షి అంతటివాడు చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన .. సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడటం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోకి చేరిపోతుంది.

ఫలితంగా ధర్మవీరుడు పులిగా .. కోతిగా .. ఆంబోతుగా .. అనేక జన్మలెత్తుతాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను తొలగించడం కోసం .. ఉత్తమ జన్మలు కలగడం కోసం “సాలగ్రామం” దానం చేయిస్తాడు. ఆ పుణ్య విశేషం వలన తన 23వ జన్మలో ధర్మ వీరుడు నియమనిష్టలెరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పూర్వ జన్మ వాసనల వలన, కార్తీక ద్వాదశి రోజున ఆయన “సాలగ్రామ దానం” చేస్తాడు.

ధర్మవీరుడు చేసిన “సాలగ్రామ దానం” వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. అప్పటివరకూ నరక లోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన వైశ్యుడు, అందులో నుంచి బయటపడతాడు. తన కుమారుడు చేసినా “సాలగ్రామ దానం” ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్య లోకాలకు వెళ్లిపోతాడు. కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామదాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ఠ మహర్షికి, జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.