కార్తీకమాసంలో తప్పకుండా దానాలు చేయాలి. విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి. కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది. వటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి. బావులు .. చెరువులు .. త్రవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో, ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి ఫలితం కలుగుతుంది. అదే విధంగా ఈ మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ, అందుకు ఉదాహరణగా జనకమహారాజుకి వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు.

ద్వాపరయుగంలో వంగదేశంలో “సువీరుడు” అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు. ఆయన భార్య మహా సౌందర్యవతి. దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవులకు వెళ్లిపోతాడు. భార్య గర్భవతి కావడంతో .. ఆయన నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు. అక్కడే వాళ్లు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ పాపను వాళ్లు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతుంటారు. ఆ అమ్మాయి యుక్తవయసులోకి వస్తుంది.

సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు. అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలుపడుతూ, ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడు ముక్తి కలుగుతుందా అని ఎదురుచూస్తుండేవాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక ముని కుమారుడు, సువీరుడి కూతురును చూస్తాడు. ఆమె సౌందర్యం ఆ మునికుమారుడి మనసును దోచుకుంటుంది. దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఒక రోజున సువీరుడిని కలిసి ఆయనకు తన మనసులోని మాటను చెబుతాడు.

సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంతో పడుతున్న బాధలను గురించి చెబుతాడు. కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనరాశిని సమర్పిస్తే తాను తన కూతురుని ఇస్తాననీ, లేదంటే ఇవ్వలేనని తేల్చి చెబుతాడు. ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు కనుక, తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెబుతాడు. అప్పటివరకూ ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళతాడు. ఆ మరుసటి రోజు నుంచే ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు.

సువీరుడి కూతురును వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ ముని కుమారుడు కఠోర తపస్సు చేస్తాడు. తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు. ఆ ధనరాశిని తీసుకొచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు. దాంతో సువీరుడు తన కూతురు ఆ ముని కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అతనితో తన కూతురును అత్తవారింటికి పంపించివేస్తాడు. కన్యాశుల్కంగా వచ్చిన సంపదతో సుఖ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తరువాత, మళ్లీ సువీరుడి భార్య గర్భవతి అవుతుంది.

ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు. ఈ సారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు. రాణి సౌందర్యవతి కావడం వలన, ఈ సారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది. బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయినిచ్చి, కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు. అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా, ఒక రోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు. సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు.

అప్పుడు సువీరుడు తన గురించిన విషయాలను ఆ యతీశ్వరుడితో చెబుతాడు. తమ పెద్ద కూతురికి కన్యాశుల్కం తీసుకుని మరీ పెళ్లి చేశానని అంటాడు. ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి కానీ, కన్యాశుల్కం తీసుకుని పెళ్లి జరిపించకూడదని చెబుతాడు. ఆ విధంగా చేయడం వలన ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు. అందువలన రెండవ కూతురు వివాహాన్ని కార్తీకమాసం .. శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు.

కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన సమస్త పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటాడు. అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చెయ్యకుండా, కన్యాదానం వలన జీవితాన్ని తరింపజేసుకోమని చెబుతాడు. అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడికి ఆ మాటలు రుచించవు. తాను సుఖపడటానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో .. పుణ్యంతో తనకి పనిలేదని చెబుతాడు. ఉన్నాయో లేవో తెలియని ఉత్తమగతుల కంటే, శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

సువీరుడు తన రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకుని అత్తవారింటికి పంపించాలని కన్న కళలు నెరవేరవు. ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకు దొరికిపోతాడు. యమభటులు ఆయనను నరకలోకానికి తీసుకుని పోతారు. కన్య విక్రయం అనే పాపానికి ఆయనకి అక్కడ శిక్షలు విధిస్తారు. అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సువీరుడి పూర్వీకుడైన “శ్రుతకీర్తి”ని కూడా యమభటులు నరకానికి తీసుకుని వచ్చేస్తారు. తనని ఎందుకు నరకానికి తీసుకుని వస్తున్నది శ్రుతకీర్తికి అర్థంకాక అయోమయానికి లోనవుతాడు. ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు.

తాను చేసిన పుణ్యకార్యాలను గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు. పుణ్యవిశేషాల కారణంగా స్వర్గానికి వెళ్లిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు. ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు .. కూతురును విక్రయించాడు. ఆ పాపం వల్లనే ఆయన నరకానికి వచ్చేశాడు. ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైనా మీరంతా నరకంలో పడవలసి వచ్చిందిని యముడు చెబుతాడు. అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా? ఇక్కడ ఉండవలసిందేనా? అంటూ శ్రుతకీర్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు.

సువీరుడికి రెండవ కూతురు ఉంది .. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఉంది. అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే, తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన నీకు శరీరం ఇస్తున్నాను. నువ్వు భూలోకానికి వెళ్లి ఆ అమ్మాయి తల్లికి నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెబుతాడు. శ్రుతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు. యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి, భూలోకానికి చేరుకుంటాడు.

అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడి భార్యను కలుసుకుంటాడు. సువీరుడితో పాటు తాము నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణం గురించి చెబుతాడు. పరిస్థితి అర్థం చేసుకుని ఆమె అంగీకరిస్తుంది. ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి, సువీరుడి కూతురుకు వివాహం నిశ్చయిస్తాడు. ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తాడు. ఆ ఫలితం కారణంగా శ్రుతకీర్తి నరకం నుంచి విముక్తుడై, తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు. ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు. “ఓ రాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానికి అంతటి శక్తి ఉంది. అందువలన ఆడపిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు” అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.