కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేనివారు, “వృషోత్సర్గము” చేయడం వలన అదే ఫలితం ఉంటుంది. “వృషోత్సర్గము” అంటే కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా వదలడం. అది ఇక ఆ ఊళ్లో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. ఎవరూ కూడా దానిని అడ్డుకోవడం .. బంధించడం వంటివి చేయకూడదు. కార్తీక పౌర్ణమి రోజున “వృషోత్సర్గము” చేయడం వలన అనేక పాపాలు నశిస్తాయి. అంతేకాదు “గయ” క్షేత్రంలో పితృదేవతలకి కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది. అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయడం మంచిదని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు.

ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధరకాల ఫలాలను దానం చేయాలి. ఉసిరికాయను దానం చేసినా అనంతమైన పుణ్య ఫలాలు చేకూరతాయి. కార్తీకంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి గనుక, ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితులలోను వదులుకోకూడదు అని చెబుతాడు. ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును. శివలింగమును దానం చేయడం వలన అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తున్న పాపాలు పటాపంచలవుతాయి. అనేక దోషాలు తొలగిపోతాయి. అందువలన శివలింగ దానం చేయాలి.

కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకూ ఇతరుల ఇళ్లలో భోజనం చేయకపోవడమే మంచిది. శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము .. నువ్వుల దానం పెట్టడం వంటివి చేయకూడదు. అలాగే వెళ్లరాని చోట్లకు వెళ్లడం .. తినరానివి తినడం వంటివి చేయకూడదు. ఆచారం పాటించనివారి ఇంట … అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారము తీసుకోకూడదు. ఇక ఏకాదశి రోజున రెండు పూటలా భోజనము చేయకూడదు. ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు. ఈ మాసంలో సాధ్యమైనంత వరకూ నదీ స్నానమే చేయాలి. అందుకు కుదరనప్పుడు చెరువుల్లో .. కాలువలలో స్నానం చేయవచ్చును. ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగతీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది. అలాంటివారి వేడినీటితో స్నానం చేయడం వలన “కల్లు”తో స్నానం చేసినట్టుగా అవుతుంది. ఉదయం వేళలోను .. సాయంత్రం వేళలోను దైవారాధన మరువకూడదు. పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్ర్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కార్తీక మాసంలో ఈ విధివిధానాలు పాటించడం వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి .. ఉత్తమ గతులు కలుగుతాయి అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.