కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన అనేక పాపాలు నశిస్తాయి. దీపం వెలిగించడం వలన పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అందువలన శివాలయంలోను .. విష్ణు సన్నిధిలోను దీపాలను తప్పకుండా వెలిగించాలి. ఆవుపాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో, అంతవరకైనా ఆ దీపం వెలగాలి. ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే, ఆ దీపాన్ని తిరిగి వెలిగించడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి ఒక కథ చెప్పడం మొదలుపెడతాడు.

పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిధిలావస్థలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిధిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు. నదీ తీరంలో శిధిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చని అనుకుంటాడు. ఆలయంలో అంతటా శుభ్రం చేసుకుని, తనతో తెచ్చిన కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళలో వెలిగించుకోవడం కోసం ఊళ్లోకి వెళ్లి ప్రమిదలు .. నూనె .. ఒత్తులు తెచ్చుకుంటాడు.

ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళతాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటు తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళుతుంది. నూనెతో ఉన్న ఆ ఒత్తిని నోటకరుచుకుని వెనుదిరుగుతుంది.

అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది .. అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరికి వెళుతుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలడంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదలో పడిన ఆ ఒత్తి .. దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే, తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది.

ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి? అని యతీశ్వరుడు అడుగుతాడు. తాను ఒక ఎలుకను అనీ, అయితే హఠాత్తుగా తన రూపంపోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్యపురుషుడు చెబుతాడు. అందుకు కారణం కూడా తనకి తెలియడం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పడు ఆ యతీశ్వరుడు దివ్యదృష్టితో చూస్తాడు.

అలా దివ్యదృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు పూర్వ జన్మలో నువ్వు బాహ్లీక దేశంలోని ఒక బ్రాహ్మణుడివి. ఎప్పుడు కూడా భగవంతుడిని ఆరాధించి ఎరుగవు. స్నానం .. జపం .. దీపారాధన .. దానధర్మాలు చేయడం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞయాగాలు చేస్తుంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచారవ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు, అవి పాటించేవారిని అవహేళన చేసేవాడివి. చివరికి ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు.

నీ భార్య ఎంతో గుణవంతురాలు .. ఉత్తమురాలు. ఆమెకి ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తనవంతు ప్రయత్నం చేసింది. నువ్వు ఎంతమాత్రం మారకపోగా, ఛాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు .. వ్రతాలు ఆచరిస్తుంటే అందుకు అడ్డుచెప్పేవాడివి. అలా మనసారా ఆమె పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల .. శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్లావు.

నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తరువాత, అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరికి ఇలా ఎలక జన్మనెత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు కనుకనే, నీకు మోక్షం లభించింది అని చెబుతాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు చేసిన దీపం కొండెక్కినప్పుడు, తిరిగి అది ప్రకాశించేలా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.