కార్తీక మాసంలో దీపారాధన చేసినవారికీ .. దీపారాధన చేయడానికి సహకరించినవారికి .. సాయపడినవారికి .. ఆధారమైనవారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందుకు ఉందాహరణగా ఒక కథ చెబుతాను విను .. అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు. ఒకసారి “మతంగ మహర్షి” శిష్యులు కార్తీకమాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీఠంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళుతుందనీ, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్నవారి పాపాలు నశిస్తాయని భావిస్తారు.

దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేయడమా అని బాగా ఆలోచన చేస్తారు. ఒక కొయ్యదుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి, దాని కోసం వెతుకులాట మొదలుపెడతారు. అలా గాలిస్తున్నవారికి ఒక స్తంభము దొరుకుతుంది. తాము అనుకున్నంత ఎత్తులో ఉంది .. నేలపై కుదురుగా నిలుస్తుంది .. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రం చేసి, ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకుని, ఆ తరువాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు.

దీపాలు చాలా సేపు వెలిగిన తరువాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్తంభములో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు, దివ్య పురుషుడిని ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు. నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ కథ ఏమిటి? అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలుపెడతాడు.

క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని .. కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ .. భగవంతుడి పట్ల భక్తి .. శాస్త్రాల పట్ల నమ్మకం లేనివాడిని. ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు .. పురాణ శ్రవణం అనేది ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకు ఎక్కడికీ వెళ్లలేదు .. ఏ క్షేత్రాలను దర్శించలేదు. పాపపుణ్యాలను గురించిన ఆలోచన చేసిందే లేదు. అపారమైన సంపద .. అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్లాయి అని చెబుతాడు.

అంతులేని అహంభావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాడిని కాదు. ఆశ్రయం కోరినవారినీ .. ఆకలితో వచ్చినవారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించే తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడూ పట్టించు కున్నది లేదు. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా క్రిందనే కూర్చోబెట్టేవాడిని. విద్యావంతులను .. వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారు లేరు .. నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో, అవినీతికి .. అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు.

అలా నేను అజ్ఞానంతో .. అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు అనుభవించాను. ఆ తరువాత కుక్కగా .. కాకిగా .. తొండగా .. చెట్టుగా అనేక జన్మలెత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది. కానీ ఎందుకూ పనికి రాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను? ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? అనేది మాత్రం అర్థం కావడం లేదు అని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకి కారణమేమిటనేది మహర్షులే సెలవీయాలని కోరతాడు.

అప్పుడు మహర్షి శిష్యులు బాగా అలోచించి ఆయనతో ఇలా అంటారు. కార్తీక మాసం .. మహా పుణ్య విశేషాలతో కూడిన మాసం. ఈ మాసంలో దీపం వెలిగించడం వల్లనే కాదు, అందుకు సహకరించినవారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి అందువలన అందరం కలిసి ఆవునెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము. స్తంభము రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి దీపస్తంభంగా ఉపయోగించాము. అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము.

కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు కనుక నీ పాపాలు నశించి, నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెబుతారు. ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన ప్రమేయం లేకుండానే తనకి లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయ వలన ఆయనకి స్తంభము జన్మ నుంచి విముక్తి కలగడం పట్ల వాళ్లంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. జీవుడు దేని వలన బద్ధుడు .. దేని వలన ముక్తుడు అవుతున్నాడు? అనే సందేహాన్ని తీర్చవలసిందిగా ఆ దివ్య పురుషుడు కోరడంతో, అంగీరసుడు జ్ఞానబోధ చేయడం మొదలుపెడతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.