కార్తీకమాసంలో తులసితో శ్రీమహా విష్ణువును పూజించడం మరింత పుణ్యఫలాలను ఇస్తుందని తెలుసుకున్న పృథు మహారాజు, శ్రీమహావిష్ణువుకు తులసి అంత ప్రీతికరమైనది ఎలా అయిందని అడుగుతాడు. అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలుపెడతాడు. ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్నంతటిని తీసుకుని కైలాసానికి వెళతాడు. ఆ సమయంలో పరమశివుడు బేతాళ రూపుడై ఉంటాడు. ఈశ్వరుడి కోసం చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించడు. దాంతో బేతాళ రూపుడి దగ్గరికి వెళ్లి సదాశివుడు ఎక్కడ? అని అహంభావంతో అడుగుతాడు.

అందుకు బేతాళరూపుడు సమాధానం చెప్పకపోవడంతో, ఇంద్రుడి అహంభావం దెబ్బతింటుంది. తనని ఆయన లెక్కచేయకపోవడం అవమానంగా భావిస్తాడు. శివుడు ఎక్కడ .. ఎక్కడికి వెళ్లాడు? అని ఇంద్రుడు కోపంగా అడుగుతాడు. బేతాళరూపుడు ఇంద్రుడి వైపు చూసి మౌనం వహిస్తాడు. దాంతో తాను అడిగిన దానికి సమాధానం చెప్పనందువలన, తగిన విధంగా శిక్షించి తీరుతానని చెప్పి ఆయన కంఠంపై “వజ్రాయుధం” పెడతాడు. అంతే .. ఒక్కసారిగా వజ్రాయుధం భస్మమవుతుంది. శివుడి కంఠం నల్లగా కందిపోతుంది. ఆగ్రహంతో ఆయన మూడో నేత్రం నుంచి మహాజ్వాల వెలువడుతుంది.

ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి బేతాళరూపుడై ఉన్నది సాక్షాత్తు శంకరుడే అని అర్థమవుతుంది. అంతే ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చెప్తాడు. ఆ స్తోత్రం మహాశివుడిని శాంతింపజేస్తుంది. తనని శాంతిపజేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలని శివుడు అడుగుతాడు. ఆయన మూడవ నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉపసంహరించమని బృహస్పతి కోరతాడు. అయితే అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు, ఆ మహాజ్వాలను గంగా సాగర సంగమంలో కలిసేలా చేస్తాడు. ఆ క్షణమే ఆ తేజస్సు బాలుడిగా మారుతుంది. సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడిగా అక్కున చేర్చుకుంటాడు.

అయితే ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు .. ఆ ఏడుపు సత్యలోకంలోని బ్రహ్మదేవుడికి కూడా స్థిమితం లేకుండా చేస్తుంది. దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరని సముద్రుడిని అడుగుతాడు. తన కుమారుడేనని చెప్పిన సముద్రుడు, ఆశీస్సులు అందించవలసిందిగా కోరతాడు. అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడి గెడ్డం పట్టుకుని లాగుతాడు. చురుక్కు మనడంతో బ్ర్రహ్మదేవుడి కళ్లవెంట నీళ్లు తిరుగుతాయి .. ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి. తన కళ్ల నుంచి రాలిన నీటిని ధరించిన కారణంగా “జలంధరుడు” అని ఆ పిల్లవాడికి బ్ర్రాహ్మదేవుడు నామకరణం చేస్తాడు. మహాశివుడు తప్ప మరెవరూ ఆయనను వధించలేరని దీవిస్తాడు.

జలంధరుడు యవ్వనవంతుడు అవుతాడు .. మహాపరాక్రమవంతుడు అవుతాడు. శుక్రాచార్యుడి సలహాలు .. సూచనలతో దానవ సామూహాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జలంధరుడు వంటి మహాబలవంతుడు తమకి నాయకుడిగా నిలిచాడని తెలిసిందో, అప్పటి వరకూ ప్రాణభయంతో దాక్కున్న దానవులంతా బయటికి వచ్చేస్తారు. అందరూ కూడా జలంధరుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ, జయహో అంటూ అతణ్ణి అనుసరించడం మొదలుపెడతారు. ఆయన శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ ఉంటారు.

అలాంటి సమయంలోనే తల లేని రాహువును చూసిన జలంధరుడు .. అందుకు కారణం ఏమిటని అడుగుతాడు. సముద్రమథనం .. అమృతం ఉద్భవించడం .. దేవతలు చేసిన మోసం .. ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకి తెలుస్తాయి. దాంతో ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. సముద్రగర్భాన్ని చిలికి తన తండ్రిని బాధించినవారిని వదిలిపెట్టేది లేదని అంటాడు. ముందుగా సముద్ర గర్భం నుంచి వెలువడిన సంపదలన్నింటినీ దేవతలు తిరిగి అప్పగించవలసిందేనని చెబుతాడు. ఆ విషయాన్ని “ఘస్మరుడు” అనే అసురుడితో ఇంద్రుడికి వర్తమానం పంపుతాడు.

అమరలోకం వెళ్లి ఇంద్రుడిని కలుసుకున్న ఘస్మరుడు, తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు. దేవతలను ఎదిరించే ప్రయత్నం మానుకోమనీ, లేదంటే శంఖుడికి పట్టిన గతే మిగిలినవాళ్లకు పడుతుందని ఇంద్రుడు అంటాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్లిన ఘస్మరుడు, ఇంద్రుడు అహంభావంతో పలికిన మాటలు చెబుతాడు. అంతే .. ఆ క్షణమే మహావీరులైనటువంటి శుంభ – నిశుంభులతో పాటు అసుర సమూహాలతో జలంధరుడు యుద్ధానికి కదులుతాడు. విషయం తెలియగానే ఇంద్రుడు కూడా దేవతా సేనలను రంగంలోకి దింపుతాడు. దేవతలకు .. అసురలకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది.

యుద్ధంలో మరణించిన అసురులను “మృత సంజీవిని” విద్యతో శుక్రాచార్యుడు బ్రతికిస్తూ ఉంటాడు. మరో వైపున దేవతా సేనలు అచేతనులైపోతుంటారు. బృహస్పతి “ద్రోణగిరి” పై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులను చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన జలంధరుడు .. ఆ ద్రోణగిరిని సముద్రంలో పడేస్తాడు. దాంతో దేవతలంతా కూడా అక్కడి నుంచి పారిపోయి మేరు పర్వత గుహల్లో దాక్కుంటారు. అమరావతిని జలంధరుడు ఆక్రమిస్తాడు .. మేరు పర్వత గుహల్లో దాక్కున్న దేవతలను వెతికి పట్టుకోవడానికి వెళతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.