జలంధరుడు తమని వెదుకుతూ వస్తున్నాడనే విషయం మేరు పర్వత గుహల్లో దాక్కున్న దేవతలకు తెలిసిపోతుంది. దాంతో వాళ్లంతా భయపడిపోతూ శ్రీమహావిష్ణువును ప్రార్ధిస్తారు. వాళ్ల ప్రార్ధనలు చెవిన పడగానే గరుడవాహనంపై శ్రీమహావిష్ణువు యుద్ధభూమికి చేరుకుంటాడు. విష్ణుమూర్తికి … జలంధరుడికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. జలంధరుడి జననం .. ఆయనకి గల వరాలను గురించి తెలిసిన శ్రీమహా విష్ణువు, ఆయన శక్తిని అభినందిస్తాడు. ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. లక్ష్మీనారాయణులు తన ఇంట నివసించాలని జలంధరుడు కోరతాడు. అందుకు స్వామి అంగీకరిస్తాడు.

జలంధరుడి ఇంట లక్ష్మీనారాయణులు ఉండిపోతారు. ఆయన భూమండలానికి తిరుగులేని నాయకుడిగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రోజున జలంధరుడి దగ్గరికి నారద మహర్షి వస్తాడు. ఆయన రాకకి గల కారణం ఏమిటని జలంధరుడు అడుగుతాడు. అందుకు నారదుడు స్పందిస్తూ .. నేను కైలాసానికి వెళ్లాను .. అక్కడ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాను. వాళ్లిద్దరినీ చూస్తే చూడముచ్చటగా అనిపించింది. వాళ్ల సంతోషాలు .. సంబరాల ముందు ఎలాంటి వైభవాలు పనికిరావు అని చెబుతాడు.

ఓ జలంధరా .. ఆ సమయంలోనే నాకు నువ్వు గుర్తొచ్చావు. సరే .. నిన్నుకూడా ఒకసారి చూసిన తరువాత, నీ వైభవాలను పరిశీలించిన తరువాత ఎవరు గొప్ప అనే విషయంలో ఒక నిర్ణయానికి రావొచ్చునని ఇలా వచ్చాను అని నారద మహర్షి అంటాడు. మరి ఇప్పుడు చూశారుగా .. మీకు ఏమనిపించింది? అని జలంధరుడు అడుగుతాడు. నిజం చెప్పాలంటే ఇద్దరూ సమానమైన వైభవంతోనే వెలుగొందుతున్నారు కానీ, కైలాసంలోని శివుడు .. పార్వతీదేవి కారణంగా నీకంటే ఒక మెట్టుపైనే ఉన్నాడు. నీ విషయంలో అదే పెద్ద లోటుగా అనిపిస్తోందని అంటాడు.

అలా అని చెప్పేసి నీ దగ్గర అందమైన స్త్రీలు లేరని కాదు నా ఉద్దేశం .. పార్వతీదేవి అంతటి సౌందర్యవంతులు లేరని నా అభిప్రాయం. నీ దగ్గర ఎంతమంది కన్యా రత్నాలు ఉన్నప్పటికీ, వాళ్లెవరినీ పార్వతీదేవితో పోల్చే సాహసం కూడా చేయలేము. అలాంటి సాధ్వీమణి లేని కారణంగానే జలంధరుడి స్థాయి తగ్గుతున్నట్టుగా తనకి అనిపిస్తోందని చెబుతాడు. జలంధరుడిలో ఈ విషయంపై ఆలోచన రేకెత్తించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు నారదుడు. ఎలాగైనా పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలని జలంధరుడు బలంగా నిర్ణయించుకుంటాడు.

ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేని జలంధరుడు .. రాహువును పిలిచి, తన మాటగా శివుడికి ఏం చెప్పాలనేది వివరించి కైలాసానికి దూతగా పంపిస్తాడు. కైలాసానికి వచ్చిన రాహువును చూడగానే, విషయమేమిటని శివుడు అడుగుతాడు. వంటినిండా విభూతి రాసుకుని .. స్మశానాల్లో తిరిగే ఆయనకి పార్వతీదేవి వంటి సౌందర్యరాశి భార్యగా అవసరం లేదని జలంధరుడి మాటగా రాహువు చెబుతాడు. అందువలన పార్వతీదేవి వంటి సౌందర్యరాశి .. జలంధరుడి జోడీగా చూడటానికే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.

ఆయన ఆ మాట అనగానే పరమశివుడి కనుబొమల నుంచి ఒక భయంకరమైన పురుష రూపం బయటికి వస్తుంది. ఆగ్రహావేషాలతో ఆ రూపం రాహువును కబళించడానికి వెళుతుంది. అయితే దూతను సంహరించకూడదని చెప్పేసి శివుడు వారిస్తాడు. ఆకలితో వచ్చిన తనకి ఏదైనా ఆహరం చూపించమని ఆ పురుషాకారుడు కోరతాడు. నీ శరీరాన్ని నువ్వే తింటూ వెళ్లమని శంకరుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ పురుషాకారుడు అలాగే చేయగా కేవలం తలభాగం మాత్రం మిగిలిపోతుంది. ఆ తరువాత కర్తవ్యమేమిటి?అన్నట్టుగా స్వామివారి వైపు చూస్తాడు.

శివ ద్వారానా “కీర్తిముఖ” పేరుతో కొలువై ఉండమని శివుడు వరాన్ని ఇస్తాడు. కీర్తిముఖ ద్వారానికి నమస్కరించిన తరువాతనే తనని దర్శించుకోవలసి ఉంటుందని శివుడు చెబుతాడు. అలా చేసినవారి పూజలు మాత్రమే ఫలిస్తాయని అంటాడు. అందుకు ఆ పురుషాకారుడు స్వామికి నమస్కరించుకుని శివద్వారాన “కీర్తిముఖుడు”గా మారిపోతాడు. అక్కడి నుంచి బతికి భయపడిన రాహువు, కైలాసంలో జరిగిన సంఘటనను జలంధరుడికి వివరంగా చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.