Sri Bhagavatam – Lakshmana drops Sita in the forest

శ్రీరాముడు తన పరిపాలన ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాలను రహస్యంగా తెలుసుకోవడం కోసం గూఢచారులను నియమిస్తాడు. రాజ్యమంతా తిరిగి వాళ్లు తాము విన్నవి .. చూసినవి ఎప్పటికప్పుడు రాముడికి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి గూఢచారులలో ఒకడు .. ఒక రోజున రాముడిని కలుసుకుంటాడు. ఒక ఊళ్లో ఒక వ్యక్తి తన భార్యను అనుమానించి ఆమెతో గొడవపడుతూ, ఏడాదిపాటు ఎక్కడో ఉన్న భార్యను తెచ్చి ఏలుకోవటానికి తాను రాముడిల అమాయకుడిని కాదని అన్నాడని చెబుతాడు.

ఆ మాట వినగానే రాముడి హృదయం ముక్కలైపోతుంది. తాను సీతను అగ్నిప్రవేశం చేయించి తీసుకువచ్చాడు .. కానీ ఆ విషయం అయోధ్య ప్రజలకు తెలియదు. అందువలన తనని ఈ నింద ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇంకెప్పుడూ ఆ నింద తనకి వినిపించకుండా ఉండాలంటే తాను సీతను వదిలేయవలసిందేననే నిర్ణయానికి వస్తాడు. లక్ష్మణుడిని పిలిచి సీతను అడవులలో వదిలేసి రమ్మని చెబుతాడు. అందుకు గల కారణం తెలుసుకున్న లక్ష్మణుడు, ఆయన మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడుగానీ ప్రయోజనం లేకపోతోంది.

అడవులకు బయల్దేరవలసిందిగా రాముడి నుంచి కబురు రావడంతో, ఆయన కూడా తనతో వస్తున్నాడని సీతాదేవి అనుకుంటుంది. మానసిక పరమైన ఉల్లాసాన్ని తాను కోరుకోవడం వలన, తనకి అడవులను చూపించాలని ఆయన భావించి ఉంటాడని అనుకుంటుంది. రథంపై లక్ష్మణుడు సిద్ధంగా ఉండటంతో, ఆయనను తోడుగా ఇచ్చి పంపిస్తున్నాడని అనుకుంటుంది. అమాయకంగా తనవెంట బయల్దేరిన సీతమ్మతల్లిని చూసి లక్ష్మణుడు దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు. సీతాదేవిని వెంటబెట్టుకుని వెళ్లి అడవులలో దింపేస్తాడు.

అప్పుడు ఆయన అసలు విషయాన్ని సీతాదేవికి చెబుతాడు. రాముడు తన నిర్ణయాన్ని తనతో చెప్పి ఉంటే, తాను సంతోషంగా అంగీకరించేదానిని కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాముడు తనని మరోసారి సందేహించాడని తాను అనుకోవడం లేదని చెబుతుంది. రాముడికి దూరం అవుతున్నందుకు తాను పడుతున్న బాధకంటే, తనని అడవులకు పంపించడానికి రాముడు ఎక్కువగా బాధపడి ఉంటాడని చెబుతుంది. ఆవేదనతో నిండిన రాముడి మనసు కుదుటపడేలా చేయమని అంటుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Lakshmana drops Sita in the forest