Ramayanam – 93 : Lord Rama sadness thinking about Sita

సీతాదేవి ఒక్కసారిగా భూమిలోకి వెళ్లిపోవడం చూసి రాముడు నిర్ఘాంతపోతాడు. ప్రాణ సమానమైన సీతను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఎంతమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది. ఊహించని ఈ సంఘటనకు లక్ష్మణుడు – శత్రుఘ్నుడు బిత్తరపోతారు. తల్లికోసం లవకుశులు కన్నీళ్ల పర్యంతమవుతుంటారు. వాల్మీకి మహర్షి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సీత ఇక తిరిగి రాదని తెలిసి రాముడు తల్లడిల్లిపోతుంటాడు. ఆమె భూమిలోకి వెళ్లిన ప్రదేశంలోనే కూలబడిపోయి, ఆ ప్రదేశాన్ని ప్రేమగా తడుముతుంటాడు.

వాల్మీకి మహర్షి ఆయన దగ్గరికి వచ్చి పైకి లేవనెత్తుతాడు. సీత తనను వదిలేసి వెళ్లి తనకి తగిన శిక్షను విధించిందని రాముడు అంటాడు. గర్భవతిగా ఉన్న సీతను అడవులకు పంపించాననీ, అయినా రఘువంశ వారసుల కోసం ఆమె ఓర్చుకుందని అంటాడు. జనక మహారాజు కూతురుగా అల్లారు ముద్దుగా పెరిగిన సీత, తనతోనే సమస్తం అనుకుందని చెబుతాడు. చిన్నప్పటి నుంచి ఎంతో సుకుమారంగా పెరిగిన సీతను, అయోధ్యలో కాకుండా అడవుల్లోనే ఎక్కువగా ఉంచానంటూ వేదన చెందుతాడు.

సీత ఎప్పుడూ కూడా తాను చెప్పిన మాటకు ఎదురు చెప్పేది కాదని అంటాడు. తన ఆనందమే ఆమె ఆనందంగా, తన సంతోషమే ఆమె సంతోషంగా మసలుకునేదని చెబుతాడు. 14 ఏళ్ల పాటు అడవులలో ఉండి వచ్చినా, తాను కష్టపడినట్టుగా ఎవరికీ ఎప్పుడూ ఒక్కమాటైనా చెప్పేది కాదని అంటాడు. తన అంతఃపురమును మాత్రమే కాదు, మొత్తం అయోధ్యనే తన ఇల్లుగా భావించి ప్రేమించడం సీతకు మాత్రమే చెల్లిందని చెబుతాడు. అందుకే ఆమెను అయోధ్య ప్రజలు మరిచిపోలేకపోతున్నారని అంటాడు.

ఆ రోజున లంకా నగరం నుంచి బయల్దేరేవేళ సీత అగ్నిప్రవేశం తన కళ్ల ముందు కదులుతూనే ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నిస్సంకోచంగా, నిస్సందేహంగా ఆమె అగ్నిప్రవేశం చేసిందని అంటాడు. సీతను చూసి లోకం గర్వపడటం కోసమే అలా చేశానని చెబుతాడు. అలాంటి సీతను వంశ పరువు ప్రతిష్ఠలకు భయపడి అడవులకు పంపించవలసి రావడం దురదృష్టమని అంటాడు. అయినా సీత తనకి వారసులను అప్పగించి వెళ్లిపోయిందని వేదనకు లోనవుతాడు. తనని విడిచి క్షణమైనా ఉండలేని సీత, ఇంతటి నిర్ణయం తీసుకుందంటే ఆమె మనసు ఎంతగా కష్టపడిందనే విషయం అర్థమైందంటూ కుమిలిపోతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 93 : Lord Rama sadness thinking about Sita

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: