Vijayawada Indrakeeladri Durga Malleswara Swamy

ఇంద్రకీలాద్రి అనగానే కొండపై కొలువైన దుర్గమ్మ తల్లి కళ్లముందు కదలాడుతుంది. ఆ తల్లి లీలా విశేషాలు మనోఫలకంపై మెదులుతాయి. కృష్ణా జిల్లా .. విజయవాడలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. విజయేశ్వరి అయిన అమ్మవారి పేరుమీదనే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి దుర్గమ్మ తల్లికి సంబంధించిన స్థలపురాణం చాలామందికి తెలుసు. కానీ ఈ క్షేత్ర పాలకుడిగా చెప్పబడే మల్లేశ్వరస్వామి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ స్వామి ఇక్కడ ఆవిర్భవించిన తీరు .. ఆ తరువాత వెలుగులోకి వచ్చిన విధానం కూడా కొంతమందికే తెలుసు.

పూర్వం పరమశివుడి కోసం బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలో కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన సదాశివుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. లోక కల్యాణం కోసం ఈ ప్రదేశంలో ఆవిర్భవించవలసిందిగా బ్రహ్మదేవుడు కోరడంతో, శంకరుడు అక్కడే ఆవిర్భవించాడు. దేవతలు .. మహర్షుల చేత పూజాభిషేకాలు అందుకున్న ఆ శివలింగం, ఆ తరువాత కాలంలో అంతర్హితమైపోయింది. అక్కడ దుర్గాదేవికి పూజలు జరుగుతున్నాయి కానీ, శివలింగం ఫలానా చోటున అంతర్హితంగా ఉందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఆదిశంకరులవారు తమ శిష్యగణంతో ఈ క్షేత్రానికి వచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకున్న ఆయన, ఆలోచనలో పడ్డారు. అమ్మవారు కోపంతో ఉన్నారనీ .. అక్కడికి దగ్గరలోనే అయ్యవారు కూడా ఉన్నారని చెప్పారు. ఆ స్వామికి నిత్యపూజలు లేకపోవడమే అమ్మవారి ఆగ్రహానికి కారణమని అన్నారు. అంతర్హితమైన శివలింగాన్ని గుర్తించి .. ప్రతిష్ఠించి, “చైత్ర శుద్ధ పౌర్ణమి” రోజున దుర్గా మల్లేశ్వరస్వామికి కల్యాణం జరిపించారు. వసంత రుతువులో ఈ కల్యాణోత్సవం జరుగుతుంది గనుక, దీనిని వసంత కల్యాణోత్సవమని పిలుస్తారు.

అప్పటి నుంచి దుర్గా మల్లేశ్వరస్వామికి కూడా నిత్య పూజలు జరుగుతూ వస్తున్నాయి. స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్న దగ్గర నుంచి దుర్గమ్మతల్లి శాంతించిందని చెబుతారు. భక్తులు అమ్మవారితో పాటు స్వామివారిని కూడా దర్శించుకుని ధన్యులవుతున్నారు. ఎలాంటి కష్టాల్లో .. ఆపదలో ఉన్నా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలచుకుంటే చాలు, ఏదో ఒక రూపంలో ఆ తల్లి నుంచి అవసరమైన సాయం అందుతుందని భక్తుల విశ్వాసం. ఆ తల్లి లీలావిశేషాలు కథలు కథలుగా ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి.

వివాహం .. సంతానం .. సౌభాగ్యం నిలిచేలా ఆ తల్లి అనుగ్రహం కోసం ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. విశేషమైన పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. భవానీ దీక్షల సమయంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. పురాణాలలోను ఈ క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది. దేవతలు .. మహర్షులు .. ఆదిశంకరుల వంటి మహనీయులు .. మహాభక్తులు నడయాడిన ఈ పుణ్యస్థలిలో అడుగుపెట్టడమే అదృష్టం అనుకోదగిన శక్తి క్షేత్రం ఇది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Vijayawada Indrakeeladri Durga Malleswara Swamy